​ ​కాకినాడ, మార్చి 11(పిన్ పాయింట్) కాకినాడ జిల్లా ఎస్పీ   జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో బుధవారం నాడు కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు మరియు ఈగల్ టీం సభ్యులు భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, యజమానులు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ విధానం, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ​స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోలలో కేవలం 6+1 మందిని మాత్రమే ఎక్కించుకోవాలని, ఆటోలకు ఇరువైపులా స్కూల్ బ్యాగులు, క్యారేజీలు తగిలించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. సాధారణ ప్రయాణికుల కోసం 3+1 నిబంధనను పాటించాలని సూచించారు.ఆటోలను రోడ్డు మధ్యలో ఆపకూడదని, ఎడమ వైపున మాత్రమే ప్రయాణికులను దించాలని కోరారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని హెచ్చరించారు. అతివేగం ప్రాణాంతకమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయరాదని అవగాహన కల్పించారు.యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలను వివరిస్తూ, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ విధానం అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-1 ఇన్ స్పెక్టర్ ఎన్. రమేష్, ఈగల్ టీం సి.ఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్.ఐ సి.హెచ్. కిషోర్ కుమార్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి