నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే -ఎస్పీ జి. బిందు మాధవ్ హెచ్చరిక
కాకినాడ, మార్చి 10,(పిన్ పాయింట్)
జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే సమాచారంతో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం జిల్లాలోని పలు కీలక ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా అత్యంత తీవ్రంగా హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కరప పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలంగి, నడకుదురు గ్రామాల్లో పర్యటించి, అక్కడ ఉన్న తయారీ యూనిట్లను సందర్శించారు. అనంతరం ఇంద్రపాలెం పరిధిలోని గంగనాపల్లి, కొవ్వూరు గ్రామాల్లోని విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.నిల్వ కేంద్రాల్లో అగ్నిమాపక యంత్రాలు పనిచేయకపోవడం, ఇసుక బకెట్లు లేకపోవడం వంటి అంశాలపై ఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.పరిమితికి మించి నిల్వలు: అనుమతి పొందిన పరిమాణం కంటే అదనంగా మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచిన కేంద్రాల వివరాలను సేకరించి, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే వారిపై ఎస్పీ ఉక్కుపాదం మోపారు. తనిఖీల్లో వెల్లడైన లోపాల ఆధారంగా సంబంధిత లైసెన్స్ అథారిటీకి నివేదికలు పంపాలని, నిబంధనలు పాటించని పక్షంలో లైసెన్సులను రద్దు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఈ తనిఖీల్లో
జిల్లా ఎస్పీ తో పాటు సర్పవరం సీఐ బి. పెద్దిరాజు, స్థానిక ఎస్సైలు, రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తుతో పాల్గొన్నారు. ఈ తనిఖీలు జిల్లావ్యాప్తంగా కొనసాగుతాయని, నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.



