కాకినాడ, మార్చి 9,(పిన్ పాయింట్) జిల్లాలోని గ్రామాలలో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని జిల్లా కలక్టర్ షాన్ మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయితీలలో 2025-2026వ సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు మరియు గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.97.98 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.50.04 కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగిందన్నారు. ఇంకా రూ.47.93 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నందున ప్రజలు బకాయి ఇంటి పన్నులు, ఇతర పన్నులు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలు తమకు అనుకూలమైన ప్రదేశం నుంచే ఫోన్ ద్వారా https://swarnapanchayat.apcfss.in వెబ్ సైట్ కి వెళ్ళి పన్నులు నేరుగా చెల్లించవచ్చన్నారు. 100% వసూలు జరగడం వలన గ్రామ పంచాయితీ నుంచి ప్రజలకు అవసరమగు కనీస అవసరములు కల్పించుటకు అవకాశం ఉందన్నారు. కావున ప్రజలు స్వచ్చందంగా వెంటనే బకాయిలు చెల్లించవలసినదిగాను, అట్లు చెల్లించని వారికి గ్రామ పంచాయితీ అందించే పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వీధి దీపాలు నిర్వహణ, గ్రామ పంచాయితీ జారీచేసే ధృవపత్రాలు మరియు ఇతర సేవలను నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయితీ పరిదిలోగల అన్ని శాఖల ప్రభుత్వ భవనములకు కూడా చెల్లించవలసిన పన్ను వెంటనే చెల్లించవలసినదిగా అన్ని శాఖల అధికారులకు సూచించారు. పన్ను వసూలకు స్థానిక నాయకులు కూడా సహకరించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించని పక్షంలో నోటీసులు జారీచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి