అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను గెలిపించండి -పిల్లి అనంతలక్ష్మి
సర్పవరంలో ఘనంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భారీ ప్రచార ర్యాలీ
హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
కాకినాడ రూరల్, నవంబరు 1,(పిన్ పాయింట్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధిని కాంక్షించి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిని పిల్లి అనంతలక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఆమె భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులను, ఓటర్లను కలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను వివరించి, మద్దతు కోరారు.
ర్యాలీ సాగినంతటా గ్రామస్తులు, మహిళలు అడుగడుగునా మంగళహారతులు పడుతూ అభ్యర్థులకు ఘన నీరాజనాలు పలికారు. సర్పవరం ఆంజనేయస్వామి ఆలయం వద్ద మాజీ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పుల్లచందు ఆధ్వర్యంలో పిల్లి అనంతలక్ష్మిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, జడ్పీటీసీగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా ప్రజాక్షేత్రంలో ఉంటూ నిరంతరం సేవలు అందించానని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పరుగులు తీస్తోందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో, ప్రజా ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి కూటమి అభ్యర్థులందరినీ గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం తనకుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



