అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ను సవరించడం ద్వారా రాజధాని అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానించింది. దీనిపై ఎల్లుండి అసెంబ్లీలో నాలుగు గంటల పాటు చర్చించి తీర్మానం చేయనున్నారు. ప్రజలకు ఊరటనిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీలోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున 'సూర్యఘర్' కనెక్షన్లు ఇవ్వాలని, విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ పద్ధతులను ప్రవేశపెట్టాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి 96 సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటు, వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల కేటాయింపులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ అకడమిక్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూనే, కుప్పం బాలికల పాఠశాలలో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, జలవనరుల శాఖలో పెండింగ్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి