టిడిపి డిఎన్ఏ ఏంటో నారా లోకేష్ నిజం తెలుసుకోవాలి' — వైఎస్‌ఆర్‌సీపీ మహిళా నేత జమ్మలమడక హితవు.
కాకినాడ రూరల్, జూలై 28 (పిన్ పాయింట్)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు లేదని, టిడిపి డిఎన్ఏ ఏంటో ఆయన ముందుగా తన తండ్రి చంద్రబాబు నుంచి తెలుసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీని దొడ్డిదారిన చేజిక్కించుకున్న చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని 'ఫేక్ పార్టీ' అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బలంతో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించారని గుర్తుచేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో కేవలం రెండు ఉచిత సిలిండర్లు ఇచ్చి మహిళలను దారుణంగా మోసం చేశారని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, 20 లక్షల ఉద్యోగాల హామీల ఊసే ఎత్తడం లేదని, రైతుల అన్నదాత నిధులు, ఉద్యోగుల పిఆర్‌సి, ఐఆర్, పెండింగ్ డిఏలను ప్రభుత్వం పక్కనబెట్టిందని ఆరోపించారు.హామీలను నెరవేర్చలేక ప్రజలను మభ్యపెట్టేందుకు 'ఇంటింటికి తెలుగుదేశం' అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని నాగమణి విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్తే రెండేళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తారనే భయంతో తెలుగు తమ్ముళ్లు కక్కలేక, మింగలేక ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను సరిదిద్దుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.



