మీడియా గొంతు నొక్కేస్తూ కేబుల్ ఆపరేటర్లపై బెదిరింపులు -తుఫాన్లు, వరదల వార్తలపై ఆంక్షలా?.. అరాచక కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు ​కాకినాడ రూరల్, సెప్టెంబర్,(పిన్ పాయింట్) రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన ఉత్తర కొరియా నియంత కిమ్‌ను మించిపోయిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై, కేవలం "చినబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం" మాత్రమే నడుస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ఎండగడుతున్న మీడియా గొంతు నొక్కేస్తూ కూటమి సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.న్యాయమైన హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమని నాగమణి అన్నారు. చరిత్రలో ఉద్యోగుల హక్కులను కాలరాసిన ప్రభుత్వాల గతి ఏమైందో కూటమి నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలను, సచివాలయ ఉద్యోగుల ఆందోళనలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం నిరంకుశ చర్య అని దుయ్యబట్టారు. కేబుల్ ఆపరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి నియంత్రిస్తున్నారని, ప్రధాన మీడియా సంస్థలకు మైనింగ్, కాంట్రాక్టులు ఎరవేస్తూ, మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనాన్ని వెదజల్లుతూ తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.చివరికి తుఫాన్లు, వరదలు, ప్రకృతి విపత్తుల వంటి అత్యవసర వార్తల ప్రసారాలపైనా ఆంక్షలు విధించే దుస్థితికి ప్రభుత్వం దిగజారడం సిగ్గుచేటని నాగమణి విమర్శించారు. "చినుకు పడితే భయం, వరదొస్తే భయం, గాలి వీచినా వణికిపోయే ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది?" అని నిలదీశారు. ​అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని, సోషల్ మీడియా యుగంలో ప్రభుత్వ పాపాలు క్షణాల్లో ప్రజల్లోకి చేరుతున్నాయని స్పష్టం చేశారు. నియంతృత్వ పోకడలతో మీడియా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి సర్కారుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆమె హెచ్చరించారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి