కాకినాడ రూరల్, మే 16,(పిన్ పాయింట్) రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ విఫలపాలన, హామీల ఉల్లంఘన, పెరిగిన ధరలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.​ప్రెస్ మీట్ ప్రారంభంలో ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంపై కన్నబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.​డ్రైవర్ విచ్చలవిడిగా మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించారు.​రాష్ట్రంలో తెల్లవారుజామునే మద్యం అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రభుత్వ మద్యం విధానంపై మండిపడ్డారు.​శ్రీకాకుళం పర్యటనలో జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన దుర్భాషణలను కన్నబాబు తప్పుపట్టారు. వైఎస్సార్సీపీని 'గొడ్డలి పార్టీ' అని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.చంద్రబాబు దగా చేయని వర్గం రాష్ట్రంలో ఏదైనా ఉందా? వెన్నుపోటు పొడవడం మీకు, మీ చరిత్రకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అనే పేరు మార్చుకుని 'తెలుగు వెన్నుపోటు పార్టీ' (టీవీపీ) అని పెట్టుకుంటే బాగుంటుంది. సొంత మీడియా బలంతో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రజలను నమ్మించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు.​గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలు ఏమయ్యాయని కన్నబాబు ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి లేదు, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. నిరుద్యోగులు, మహిళలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.జగన్ హయాంలో ఆక్వా రైతులకు అండగా ఉండటానికి 'ఆప్సాడ' చట్టాన్ని తెచ్చి మేలు చేశారు. కానీ నేడు మేత (ఫీడ్) ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఉత్పత్తి ధరలు తగ్గిపోయాయి. ఆక్వా రైతును ఆదుకునే నాథుడే లేక రోడ్డున పడ్డాడని ఆవేదన చెందారు.రాష్ట్రంలో ప్రతి రైతును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని,వ్యవసాయ పెట్టుబడులు పెరిగి, పంటల ధరలు తగ్గిపోవడంతో రైతాంగం కుదేలైందన్నారు​రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుపై కన్నబాబు గణాంకాలతో సహా నిలదీశారు.ప్రస్తుతం ఏపీలో పెట్రోల్ ధరలు దేశంలోనే అతి ఎక్కువ ధర అని మండిపడ్డారు.కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కంటే రూ 15 తక్కువకే లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారని గుర్తుచేశారు.​గతంలో లోకేష్ తన 'యువగళం' పాదయాత్రలో పెట్రో ధరలను 'జె-టాక్స్' అని విమర్శించారని, మరి నేడు అమ్ముతున్న అధిక ధరలను 'సి-టాక్స్' అనాలా? అని ప్రశ్నించారు. ​అవినీతిలో, అధిక ధరల్లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.​వైఎస్ జగన్ హయాంలో విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని కన్నబాబు కొనియాడారు. ​శ్రీకాకుళం జిల్లాలో జగన్ నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తే, ఆయన ప్రజలకు ఏం చేశారో అర్థమవుతుందన్నారు.నేడు కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు సజావుగా సాగడం లేదన్నారు.​ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా దొరకని పరిస్థితి దాపురించింది. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.కూటమి ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన అంటే కేవలం 'అమరావతి' మాత్రమే అనేలా ఉందని కన్నబాబు విమర్శించారు. గతంలో వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటివద్దకే అన్ని రకాల సేవలు అందేవని, నేడు ఏ ఒక్క సేవ కూడా ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు.రాష్ట్రంలో సంక్షేమం పూర్తిగా అడుగంటిపోయిందని, కేవలం అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని కన్నబాబు ఆరోపించారు.ఎదుటివారిపై గుడ్డ కాల్చి వేస్తే వాడే కాలిపోతాడు అనే చందంగా చంద్రబాబు తీరు ఉంది. జగన్ వైపు మీరు ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయనే సత్యాన్ని గ్రహించమని,ఇప్పటికైనా జగన్‌ను తిట్టడం మాని, ప్రజలకు మేలు చేయడంపై దృష్టి పెట్టండి అని కురసాల కన్నబాబు హితవు పలికారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి