కాకినాడ, అక్టోబర్ 3,(పిన్ పాయింట్) వైద్యులకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్  ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో రెండు రోజుల జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ శిబిరం శనివారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉషాకిరణ్ రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ చైర్‌పర్సన్ డా. గర్లపాటి నందకిశోర్ మాట్లాడుతూ, వైద్యులు రిజిస్ట్రేషన్ సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే శ్రమను, సమయాన్ని ఆదా చేయడానికే స్థానికంగా ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్యులు తమ రిజిస్ట్రేషన్లను సకాలంలో పునరుద్ధరించుకోవడంతో పాటు, అదనపు విద్యార్హతలను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం శిబిరంలో తొలి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాన్ని ఓ సీనియర్ వైద్యుడికి ఆయన స్వయంగా అందజేశారు.రిజిస్ట్రేషన్ రెన్యువల్, రీ-రిజిస్ట్రేషన్, పీజీ/అదనపు విద్యార్హతల నమోదు, డాక్టర్ సైన్-అప్ తదితర సేవలు అక్టోబర్ 3, 4 తేదీల్లో అందుబాటులో ఉంటాయని,సేవలు పొందదలచిన వైద్యులు ముందుగా అధికారిక వెబ్‌సైట్  ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, అవసరమైన ఫొటోలతో పాటు రెన్యువల్, రీ-రిజిస్ట్రేషన్ కొరకు హెచ్‌పీఆర్  ఐడీ తప్పనిసరి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఎంసీ సభ్యులు డా. కేశవరావు బాబు, వైద్యులు డా. చిట్ల కిరణ్, డా. జి.ఎస్. మూర్తి, డా. ఆర్.ఆర్.కె. రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 4న కూడా కొనసాగనున్న ఈ శిబిరాన్ని కాకినాడ మరియు పరిసర ప్రాంతాల వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ కాకినాడ శాఖ కార్యదర్శి డా. ఎస్.సీహెచ్.ఎస్. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి