భారీ వర్షాలపై కాకినాడ నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి అప్రమత్తం - కమిషనర్ ఎన్‌.వి.వి. సత్యనారాయణ -​నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటన కాకినాడ, సెప్టెంబర్ 24,(పిన్ పాయింట్) భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని కమిషనర్ ఎన్‌.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో గురువారం ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా బాపూజీనగర్‌లో బైక్‌పై స్వయంగా తిరుగుతూ ఇళ్ల పరిసరాల్లో నిలిచిన వర్షపు నీటి పరిస్థితిని పరిశీలించారు.జగన్నాథపురం, పద్మనాభనగర్, బాపూజీనగర్ వంటి ప్రాంతాల్లో మోటార్లు, భారీ పంపుల ద్వారా నిలిచిన వర్షపు నీటిని వేగంగా తొలగిస్తున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టారు. మెయిన్ రోడ్, మార్కెట్ వీధి, నూకాలమ్మ గుడి రోడ్డు, రెవెన్యూ గెస్ట్ హౌస్ రోడ్డు, ఆర్టీవో ఆఫీస్ సర్కిల్ సహా నగరంలో గుర్తించిన 8 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.చెట్లు విరిగిపడటం, విద్యుత్ వైర్లు తెగిపోవడం వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇంజినీరింగ్, శానిటేషన్, విద్యుత్ శాఖలతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ​ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముంపు సమస్యపై సమాచారం అందిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వి చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి