భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఆర్డీవో ఎస్. మల్లిబాబు కాకినాడ రూరల్, సెప్టెంబర్ 24,(పిన్ పాయింట్) భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఆర్డీవో ఎస్. మల్లిబాబు అధికారులను ఆదేశించారు. ​తీవ్ర వాయుగుండం తీరం దాటిన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల పరిధిలోని రమణయ్యపేట, తిమ్మాపురం అవంతినగర్ ప్రాంతాల్లో ఆర్డీవో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కాలనీలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఇరిగేషన్ డ్రైన్లను తక్షణమే శుభ్రం చేసి నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. రమణయ్యపేట ఛానల్‌ను పరిశీలించిన ఆర్డీవో, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన గుర్రపు డెక్కను తొలగించేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ పర్యటనలో ఆర్డీవో వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి సతీష్, తహసీల్దార్ పోతురాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భవానితో పాటు పంచాయతీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి