అమరావతి, మార్చి 12,(పిన్ పాయింట్) రాష్ట్రంలో బాణాసంచా తయారీ యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై ప్రభుత్వం నిఘా పెంచింది. శాంతిభద్రతలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95 బాణాసంచా తయారీ యూనిట్లలో వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నిల్వలు, భద్రతా ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ నిల్వ కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలి.స్టోరేజ్ పాయింట్లతో పాటు, ఇప్పటి వరకు మంజూరు చేసిన లైసెన్సులను కూడా పునఃసమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.బాణాసంచా లేదా పేలుడు పదార్థాలను ఇళ్లల్లో నిల్వ చేసినా, పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచినా అస్సలు ఉపేక్షించవద్దని సీఎం హెచ్చరించారు.ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం కంటే, అవి జరగకుండా నివారించడమే ప్రభుత్వ లక్ష్యం. నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా ఉండాలన్నారు. తమిళనాడులోని శివకాశీలో భారీ ఎత్తున బాణాసంచా తయారీ జరుగుతున్నప్పటికీ, అక్కడ ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉండటంపై సీఎం దృష్టి సారించారు. అక్కడ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, తయారీ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో మన రాష్ట్రంలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలతో బాణాసంచా తయారు చేసుకునేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇకపై రాష్ట్రంలో బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగనుంది. నిబంధనలు మీరితే లైసెన్సుల రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి