వైసీపీ ఆధ్వర్యంలో ‘డీఎస్సీ అక్రమాలు, అవినీతిపై పోరు’ నిరసన
కాకినాడ రూరల్, ఆగస్టు 4,(పిన్ పాయింట్)
నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు నేతృత్వంలో కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయంలో భారీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.డీఎస్సీ నిర్వహణ, ఫలితాల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని నాయకులు ఆరోపించారు. దీనిపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పారదర్శకత లేని విధానాలతో వేలాది మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి.ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలి.టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని,కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను ఓట్ల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు.
యువత, విద్యార్థుల హక్కుల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు.ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీలలో సర్పవరం జంక్షన్ వద్దవిద్యార్థి సంఘాలు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఆందోళన, నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.



