కాకినాడ, జూలై 31 ,(పిన్ పాయింట్) కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) కే.టి. సుధాకర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఇంటింటి ధృవీకరణ, మరణాలు, శాశ్వత నివాస మార్పులు, డూప్లికేట్ నమోదుల పరిశీలన అనంతరం తాజా ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ ప్రక్రియతో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.2026 మే 26 నాటికి కాకినాడ సిటీ నియోజకవర్గంలో 234 పోలింగ్ కేంద్రాలు ఉండగా, తాజా ముసాయిదా జాబితా ప్రకారం వాటి సంఖ్య 261కు పెరిగింది. దీంతో 27 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ ఆర్ వో సుధాకర్ తెలిపారు.అలాగే, మే 26 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,42,514 మంది ఓటర్లు ఉండగా, జూలై 31 నాటికి విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 1,93,114 మంది మాత్రమే నమోదయ్యారు. దీంతో 49,400 ఓట్లు తొలగించినట్లు ఆయన వెల్లడించారుఈ ఓట్లు తొలగింపు కు ప్రధాన కారణాలుగా ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 7,394 మంది ఓటర్లు మరణించగా, 23,505 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు నివాసం మార్చడం లేదా గైర్హాజరుగా ఉండటం, 18,609 డూప్లికేట్ ఓటరు నమోదులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు ఈఆర్వో కే.టి. సుధాకర్ తెలిపారు.ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి