కాకినాడ రూరల్, జూలై 29:(పిన్ పాయింట్) మానవత్వమే దివ్యత్వానికి తొలిమెట్టని, ఆ దివ్యత్వ ప్రయాణమే పరమాత్మ సన్నిధికి చేర్చే ఆధ్యాత్మిక మార్గామని 'స్ఫూర్తి ఓం' కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని ‘ప్రజ్ఞా ఫంక్షన్ హాల్’లో కాకినాడ స్ఫూర్తి ఓం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, గురు విశ్వ స్పూర్తి దివ్య ఆశీస్సులతో వివిధ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు హాజరయ్యారు. ​ ​ఉదయం నుంచే స్పూర్తి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసన, ప్రాణాయామ, ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభించారు. యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం (మెడిటేషన్) ద్వారా సాధారణ భౌతిక మనస్సును పరిశుద్ధమైన అంతఃకరణగా మలచవచ్చని వక్తలు తెలిపారు. ఈ సాధన ద్వారా వ్యక్తి క్రమంగా ఆత్మ స్థాయి నుండి విశ్వాత్మ స్థాయికి పరివర్తన చెందుతాడని, ఇది ప్రశాంత జీవితానికి మూలస్తంభమని పేర్కొన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదరించడమే నిజమైన ఆధ్యాత్మికత అని గురు విశ్వ స్పూర్తి బోధనలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ​కేవలం సిద్ధాంతాలు వల్లించడం కాకుండా ప్రశాంతతను, మానవతా దృక్పథాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడమే 'ప్రాక్టికల్ ఫిలాసఫీ' అని సభ్యులు స్పష్టం చేశారు. తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగించడమే నిజమైన సంస్కారానికి నిదర్శనమని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొంటూ, చలించని స్థిరమైన నిగ్రహాన్ని అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి బోధనల ద్వారా వివరించారు. ​కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూస్థాన్ షిప్ యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "ప్రకృతి సంబంధమైన మనస్సును ఇతర ఆలోచనలు లేకుండా ధ్యాన, మనో ప్రస్థానం సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని బలోపేతం చేసి శారీరక, మానసిక ప్రశాంతత పొందవచ్చు" అని పేర్కొన్నారు. ​గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. "ఆధునిక విజ్ఞానాన్ని సారధిగా చేసుకుని, సైంటిఫిక్ సెయింట్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్పూర్తి అందించిన ఆచరణాత్మక ధ్యాన మనో ప్రస్థానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందించుకోవాలి" అని పిలుపునిచ్చారు. ​ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ప్రాణాయామం, ధ్యానం మరియు ప్రస్థాన సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాధవరపు వీర రాఘవ రాము కోరారు. ​ ​సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను 'స్ఫూర్తి ఓం' కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. నిత్య జీవిత సమస్యల నివారణకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ గురు విశ్వస్పూర్తి వారిని దర్శించుకుని మహా ప్రసాదాన్ని స్వీకరించారు. ​ఈ కార్యక్రమంలో 'స్ఫూర్తి ఓం' కుటుంబ సభ్యులు జి. సదాశివరావు, నాజీయా ఫరా, ఎల్. సతీష్, నగేష్, స్థానిక ప్రముఖులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి