మోసపూరిత హామీల "బ్రాండ్ అంబాసిడర్" చంద్రబాబు.. -కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిప్పులు.
మోసపూరిత హామీల "బ్రాండ్ అంబాసిడర్" చంద్రబాబు..
-కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిప్పులు
-కాకినాడ రూరల్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
- 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరిట వినూత్న నిరసన
కాకినాడ రూరల్, జూన్ 12,(పిన్ పాయింట్)
అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చరిత్రలో 'మోసపూరిత హామీలకు బ్రాండ్ అంబాసిడర్'గా నిలిచిపోతారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని వైఎస్సార్‌సీపీ రూరల్ పార్టీ కార్యాలయం వేదికగా కన్నబాబు ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో తరలివెళ్లి నిరసన గళం విప్పారు.ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు రంగురంగుల కలలు చూపిస్తూ ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాలు నేటికీ అమలుకు నోచుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు.
"ప్రజల పక్షాన నిలబడి సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై తప్పుడు కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదని,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సరే వైఎస్సార్‌సీపీ ప్రజాపక్షంగా పోరాడుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు చంద్రబాబు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యాక్రమంలో జడ్పిటిసి ను రామకృష్ణ (కిట్టు) తిమ్మాపురం మాజీ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.



