కూటమిలో చిచ్చుపెట్టేందుకే ‘పేటీఎం’ నాగేశ్వర్ అబద్ధాలు - కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజం
కాకినాడ రూరల్, మే 21,(పిన్ పాయింట్)
ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించి, ప్రజారంజక పాలన అందిస్తున్న టి.డి.పి - జనసేన - బిజెపి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా కొందరు మేధావుల ముసుగులో కుట్రలకు తెరలేపారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రముఖ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీపై చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అవి కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినవని ఆయన తీవ్రంగా ఖండించారు.
అసలు జరగని మీటింగ్‌ను జరిగినట్టు సృష్టించి, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేస్తున్న కుట్రలో భాగస్వామిగా నాగేశ్వర్ మారారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి) చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఈ సందర్భంగా నానాజీ సమర్థించారు. నాగేశ్వర్ వెంటనే తన తప్పుడు మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వీడియోలో మాట్లాడుతూ... జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి
నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి, ‘వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయండి’ అని కోరినట్లు కథ అల్లారని పంతం నానాజీ పేర్కొన్నారు. దానికి అమిత్ షా స్పందిస్తూ.. "జగన్ మాకు లాంగ్ టైమ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్ స్టెంట్ ఫ్రెండ్" అని అన్నట్లు నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందనను ప్రస్తావిస్తూ.. "అసలు అలాంటి మీటింగ్ ఏదీ జరగనే లేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందుతున్న పేటీఎం పైసల కోసమే నాగేశ్వర్ ఇటువంటి అవాస్తవాలను వల్లిస్తున్నారు" అని నానాజీ ధ్వజమెత్తారు.ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, జర్నలిస్టుగా నాగేశ్వర్ పట్ల సమాజంలో ఒక గౌరవం ఉండేదని, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆయనపై ఎంతో గౌరవంతో నాగేశ్వర్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు స్వయంగా వెళ్లి ఆశీర్వదించారని నానాజీ గుర్తుచేశారు. కానీ, నేడు నాగేశ్వర్ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆయనకు శారీరక చూపు లేకపోయినా.. జ్ఞాన నేత్రంతో విశ్లేషణలు చేస్తారని అందరూ భావించారు. కానీ నేడు జగన్ ప్యాలెస్ నుంచి అందిన పైసల మూటలతో ఆ జ్ఞాన నేత్రం కూడామూసుకుపోయిందన్నారు. వైసిపి పేటీఎం కార్యకర్తలకు 5 రూపాయలు ఇస్తే.. ఈ కొత్త పేటీఎం మేధావికి 11 రూపాయలు ఇస్తున్నారేమో? అందుకే దేశ హోంమంత్రిపైనే తప్పుడు కూతలు కూస్తున్నారు అని కూటమి శ్రేణులు మండిపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలే అసహ్యించుకుని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈడ్చి కొట్టిన జగన్ గురించి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ కి దిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని నానాజీ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, గ్రామీణాభివృద్ధి గురించే చర్చిస్తారని వైసీపీ హయాంలో పూర్తిగా మూలనపడి, జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా 'జల్ జీవన్ మిషన్' కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడి ఏకంగా రూ. 23,000 కోట్లు మంజూరు చేయించారు.కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సంఘం నిధులు రూ. 5,000 కోట్లు, ఉపాధి హామీ నిధులు రూ. 21,560 కోట్లు, గిరిజన ప్రాంతాల రోడ్ల కోసం 'అడవి తల్లి బాట' పేరిట రూ. 1,005 కోట్లు రాష్ట్రానికి వచ్చేలా చేశారని,కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రపు కోత నివారణకు ప్రొటెక్షన్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపిందంటే దానికి పవన్ కళ్యాణ్ అమిత్ షా తో జరిపిన చర్చలే కారణం అన్నారు.గత ఐదేళ్లలో జగన్ హయాంలో కేంద్ర నిధులు పక్కదారి పట్టినా, జల్ జీవన్ మిషన్ పనులు ఆగిపోయినా ఈ 'పేటీఎం' నాగేశ్వర్ ఒక్క రోజైనా నోరు మెదిపారా? అని పంతం నానాజీ ప్రశ్నించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ చరిత్రను పరిశీలిస్తే ఆయన అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని నానాజీ ఎద్దేవా చేశారు.
గ్రాడ్యుయేట్స్ తరఫున గెలిచిన నాగేశ్వర్, నిరుద్యోగ యువత కోసం ఏనాడూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇప్పించేలా పోరాటం చేయలేదని,ఆయన ఎడిటర్‌గా పనిచేసిన ఏ ఒక్క టీవీ ఛానెల్ గానీ, ఇంగ్లీష్ దినపత్రిక గానీ కనీసం వృద్ధిలోకి రాలేదు, సదరు సంస్థలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు.ఎన్.డి.ఏ కూటమి అంటేనే కడుపుమంటతో రగిలిపోయే నాగేశ్వర్ లాంటి వ్యక్తులు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఆర్థిక నేరగాడు జగన్ ప్యాలెస్ నుంచి వచ్చే తాడేపల్లి సోర్స్‌లను నమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని పంతం నానాజీ మండిపడ్డారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోందని.. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి 'పేటీఎం మేధావుల' కుట్రపూరిత అబద్ధాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరని ఎమ్మెల్యే పంతం నానాజీ తేల్చిచెప్పారు.



