ఉన్నత విద్యలో పరిశోధన, లోతు సముద్ర మత్స్యకారంలో ఏపీ దూకుడు - రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 11,(పిన్ పాయింట్)
దేశంలో ఉన్నత విద్యారంగంలో పరిశోధనలు (ఆర్ అండ్ డి), సముద్ర మత్స్యకార అభివృద్ధిపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబ అడిగిన కీలక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రెండు రంగాలలోనూ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని కేంద్ర విద్యా, మత్స్యశాఖలు స్పష్టం చేశాయి.దేశంలో పరిశోధన మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయింపులను భారీగా పెంచిందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
2010–11లో రూ. 60,196 కోట్లుగా ఉన్న వ్యయం, 2020–21 నాటికి రూ. 1,27,380.96 కోట్లకు పెరిగింది.2025–26 ఆర్థిక సంవత్సరానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్ఈఆర్‌ల వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు రూ. 20,041 కోట్లు మంజూరు చేశారు.
ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా 3,688 మందికి లబ్ధి చేకూరగా, రాబోయే బడ్జెట్‌లో 10,000 కొత్త ఫెలోషిప్‌లను ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌లోని ఐఐటీ తిరుపతి, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెం, ఐఐఎస్ఈఆర్ తిరుపతి వంటి సంస్థలు పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ ఆధునిక పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం కొనియాడింది.
లోతు సముద్ర మత్స్యకారం ఏపీకి అగ్రతాంబూలం
భారత ప్రత్యేక ఆర్థిక మండలి లో చేపల వేటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మత్స్యశాఖ వివరించింది.
ఆక్సెస్ పాస్‌ల జారీలో ఏపీ హవా
దేశవ్యాప్తంగా 707 నౌకలకు ఆక్సెస్ పాస్‌లు జారీ చేయగా, అందులో 162 నౌకలు ఆంధ్రప్రదేశ్‌కే చెందినవి కావడం విశేషం.కాకినాడ జిల్లాలో అత్యధికంగా 105 పాస్‌లు.విశాఖపట్నం 52 పాస్‌లు.
కోనసీమ 4 పాస్‌లు.బాపట్ల 1 పాస్.
రాష్ట్ర సముద్ర మత్స్య ఉత్పత్తి 2020–21లో 5.54 లక్షల టన్నుల నుంచి 2024–25 నాటికి 6.51 లక్షల టన్నులకు పెరిగింది.పీఎం మత్స్య సంపద యోజన కింద శిక్షణ పొందిన 8,040 మంది మత్స్యకారులలో 874 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే,కొత్తగా 50 లోతు సముద్ర నౌకల కోసం రూ. 6,000 లక్షల ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది.
ఉన్నత విద్యలో పరిశోధనలు పెరగడం మరియు తీరప్రాంత మత్స్యకారులకు లోతు సముద్ర వేటలో కొత్త అవకాశాలు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్ర యువతకు, మత్స్యకార సోదరులకు కేంద్ర పథకాలు పూర్తిస్థాయిలో అందేలా నా వంతు కృషి చేస్తానని
ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు విద్యా రంగంలో, ఇటు నీలి విప్లవం లో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని చాటిచెబుతోందనని ఆశాభావం వ్యక్తం చేసారు.



