ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన
-12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుష అభ్యర్థులకు
-15న తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు
-నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక
- కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు)
- ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి
గుంటూరు, మార్చి 11,(పిన్ పాయింట్)
నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వివరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు నిర్దేశించిన వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా మార్చి 9వ తేదీ నుండి మహిళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ లో భాగంగా ప్రతీ ఏడాది రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి అదనంగా తెలుగు రాష్ట్రాలైన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు.
నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు.
*ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ*
ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులకు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులన్నారు. కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు), ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగిన విద్యార్హత ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం మరియు ఇంగ్లీషులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
1.6 కిలో మీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్షకు ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుందని, ఒక తప్పు జవాబుకు పావు మార్కు తీసివేయడం జరుగుతుందని చెప్పారు.
అభ్యర్థులు ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీ కీ హాజరు కావచ్చని తెలిపారు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవపరిచిన విద్యార్హత సర్టిఫికేట్లు (X మరియు XII పాసైన సర్టిఫికేట్లు లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్లు), నివాస ధృవీకరణ (డొమిసైల్ సర్టిఫికేట్),
ఎన్.సి.సి సర్టిఫికెట్ (ఒక వేళ ఉంటే),
ఆధార్ కార్డ్, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇటీవలి తీసుకున్న 10 కాపీలు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు, ప్రతి సర్టిఫికెట్ కు సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు.
*ఉదయం 4 గంటల నుండే అనుమతి... ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదు*
ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని కోరారు. ఉదయం 4 గంటలకు వచ్చినా అనుమతి ఉంటుందని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆర్.టి.సి బస్సులను విజయవాడ, గుంటూరుల నుండి నడుపుతోందని ఆయన చెప్పారు.
అభ్యర్థులు అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోరాదని కోరారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల పాల్గొన్నారు.

