తుపాన్ బాధితుల సాయానికి ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు
కాకినాడ, అక్టోబర్,(పిన్ పాయింట్)
‘అర్నబ్’ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. తుపాన్ వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
తుపాన్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం, చెట్లు లేదా గోడలు కూలిపోవడం, రహదారులు లేదా ఇళ్లలోకి వరద నీరు చేరడం వంటి ఏ విధమైన విపత్తు సమస్యలు ఎదురైనా ప్రజలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు నమోదు చేసే విధానం:
• ముందుగా మీ మొబైల్ నుంచి 9552300009 నంబరుకు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి.
• అనంతరం స్క్రీన్‌పై కనిపించే జాబితా నుంచి ‘సేవలు’ (Services) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
• అందులో ‘అర్నబ్ సైక్లోన్ ఇష్యూస్’ (Arnab Cyclone Issues) విభాగాన్ని క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత ‘రిపోర్ట్ ఇష్యూ’ (Report Issue) ఎంచుకుని, ‘కన్‌ఫర్మ్’ చేయాలి.
• అనంతరం ‘రిజిస్ట్రేషన్’ ఆప్షన్ ద్వారా మీ పేరు, జిల్లా, మండలం వివరాలు నమోదు చేయాలి.
• మీ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యను క్లుప్తంగా వివరించడంతో పాటు, పరిస్థితికి సంబంధించిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
ఫిర్యాదు అందిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత స్థానిక అధికారులకు పంపించి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ఈ వాట్సాప్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



