కాకినాడ రూరల్ విద్యుత్ ఏఈ జి. రాజుకు ఉత్తమ సేవా పురస్కారం
కాకినాడ రూరల్, ఆగస్టు 15,(పిన్ పాయింట్)
కాకినాడ రూరల్ డివిజన్ పరిధిలోని డి-4 సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ జి.రాజు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను ఏపీఈపీడీసీఎల్ ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని దక్కించుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ సీఎండీ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందుకున్నారు.
వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో, సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. శాఖాపరమైన లక్ష్యాలను సకాలంలో చేరుకోవడంతో పాటు, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో డి-4 సెక్షన్ ముందంజలో ఉండేలా చేసినందుకు ఈ అవార్డు వరించింది. ఉత్తమ పనితీరు కనబరిచి సీఎండీ అవార్డు అందుకున్న ఏఈ జి. రాజును కాకినాడ రూరల్ విద్యుత్ శాఖ అధికారులు, లైన్‌మెన్లు, తోటి సిబ్బంది, స్థానికులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ పురస్కారం సాధ్యమైందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.



