ప్రభుత్వం అంటే మీ సొంత జాగీరు కాదు.. -రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.
కాకినాడ రూరల్, ఆగస్టు 11, (పిన్ పాయింట్ )
కూటమి ప్రభుత్వం అన్ని రంగాలనూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కంకణం కట్టుకుందని, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పేరిట రాష్ట్రాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను గణాంకాలతో సహా ఎండగట్టారు.
17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను అందించే లక్ష్యంతో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందని కన్నబాబు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు సకాలంలో స్పందించి, ప్రజా నిరసన తెలపడంతోనే ఆ నిర్ణయం ప్రస్తుతానికి ఆగిందని ఆయన గుర్తుచేశారు.
పిపిపి పేరిట ప్రజా ఆస్తుల విధ్వంసం
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, వైద్యా రోగ్య రంగాలు, ఆరోగ్యశ్రీ పథకంతో పాటు పబ్లిక్ గార్డెన్లు, పార్కులు, చివరికి పారిశుధ్య నిర్వహణను కూడా ప్రైవేట్ పరం చేయటానికి చూస్తున్నారని
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్కులు, విద్యా సంస్థలు, వైద్య శాలలన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే రేపు సామాన్య పౌరుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి పార్కుకి వెళ్లాలన్నా 'యూజర్ ఛార్జీలు' కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదేనా మీరు తెచ్చిన 'మంచి రోజులు'?" అని కన్నబాబు ప్రశ్నించారు.
పచ్చ పత్రికల వత్తాసు - సొంత భజన
కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సమర్థిస్తూ, పీపీపీ విధానమే దైవమన్నట్లు కొన్ని అనుకూల మీడియా సంస్థలు డప్పు కొడుతున్నాయని కన్నబాబు మండిపడ్డారు.ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాత్సహిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఈనాడులో రాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.సొంత పత్రికల్లో తమకు అనుకూలంగా రాయించుకుని, పిపిపి విధానం చాలా గొప్పదని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రభుత్వ విధానాలను ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.
వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో దోపిడీ
పిపిపి ప్రాజెక్టుల పేరిట వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా 20 శాతం నుండి 40 శాతం వరకు ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ప్రజల సొమ్ముతో కట్టిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం వెనుక పెద్ద ఎత్తున స్వలాభం దాగి ఉందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి అనుచరులకు, సొంత మనుషులకు ఆస్తులు దక్కితే... రాబోయే రోజుల్లో సాధారణ ప్రజలకు కష్టాలు మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు'
"ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తులకు కాపలాదారు మాత్రమే గానీ, అది మీ సొంత జాగీరు కాదని చంద్రబాబు గ్రహించాలి. కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచమంతా చీకటిగా ఉందనుకోవడం, ఎవరూ చూడటం లేదనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది" అని తీవ్ర హెచ్చరికలు చేశారు.
గతంలో చెత్త పై పన్ను వేశామని వైసిపి పై విష ప్రచారం చేసిన చంద్రబాబు
నేడు ఏకంగా పారిశుధ్య నిర్వహణను కూడా ప్రైవేటీకరించడం వెనుక అసలు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఓ కార్పొరేట్ కంపెనీకి అమ్మేసినట్లు కూటమి పాలన సాగుతోందని, ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ దీనిపై నిలదీస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.



