కాకినాడ రూరల్, మే 15,(పిన్ పాయింట్) కాకినాడ రూరల్ మండలంలో శనివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీల కుటుంబాల్లో లారీ రూపంలో వచ్చిన మృత్యువు తీవ్ర శోకాన్ని నింపింది. ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలను వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.స్థానిక వివరాల ప్రకారం... కాకినాడ రూరల్ పరిధిలోని 216 బైపాస్ రోడ్డు, కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయాన్నే ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు రోడ్డు దాటుతుండగా, అమిత వేగంతో వచ్చిన ఒక టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో చీడిగ గ్రామానికి చెందిన ​వాసంశెట్టి సత్యవతి,పాలిక కృష్ణవేణి,​చెల్లూరు అన్నవరం, మట్టపర్తి అరుణ అనే నలుగురు మహిళలు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడం చూసిన స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ​ప్రమాద సమాచారం అందిన వెంటనే ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై, అతివేగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ​ఉదయాన్నే కడుపుకూటి కోసం పనిలోకి వెళ్తూ అనంతలోకాలకు వెళ్లిన కూలీల కుటుంబ సభ్యుల రోదనలతో కాకినాడ రూరల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి