సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన
కాకినాడ రూరల్, అక్టోబర్ 4 (పిన్ పాయింట్): తిమ్మాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న 18వ శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మాదారపు తాతాజీ మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా గ్రామంలో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్ధి వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధి చోడిశెట్టి చక్రధర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భారీ అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందాలని కోరారు.



