ఆర్థిక సవాళ్లున్నా ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్: మంత్రి పొంగూరు నారాయణ.
కాకినాడ, ఏప్రిల్ 8,(పిన్ పాయింట్)
రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ, అభివృద్ధి మరియు సంక్షేమాల మధ్య సమతుల్యతను పాటిస్తూ లక్ష్యాలను అధిగమిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో నిర్వహించిన ‘బడ్జెట్ అవుట్ రీచ్ 2026-27’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల ఆదాయ వనరులు కోల్పోవడం, గత ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఏర్పడిన భారీ అప్పుల భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయని విమర్శించారు.గత ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల అప్పులను మిగిల్చిందని, వాటిని తీరుస్తూనే ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులను గాడిలో పెడుతోందని పేర్కొన్నారు.వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారిన ఏపీలో, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అమలు చేస్తోందని తెలిపారు.ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నా, ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం రాజీ పడటం లేదని మంత్రి నారాయణ వివరించారు.
వృద్ధులు, వితంతువుల పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచడం,స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మరియు దీపం 2.0 వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.
రూ. 9.68 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.41 లక్షల మందికి ఉపాధి కల్పన,గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న 610 ఒప్పందాల ద్వారా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1600 కోట్ల ప్రోత్సాహకాలు,విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ రాష్ట్ర ప్రగతిలో మైలురాయిగా నిలవనుందన్నారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ బిల్లు పాస్ చేసినందుకు, ప్రధాని నరేంద్ర మోదీ మరియు సీఎం చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది.జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బడ్జెట్‌లోని కీలక అంశాలను విశ్లేషించగా, మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధిస్తున్న వాస్తవ ఫలితాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని, సమర్థవంతమైన ఆర్థిక విధానాలతో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి దిశగా సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ తదితర ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.



