ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రధాన కర్తవ్యం -జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్
కాకినాడ రూరల్ ,మార్చి 30 (పిన్ పాయింట్)
ప్రజల సమస్యలను చట్టపరంగా, త్వరితగతిన పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 32 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు.
బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీసంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి పరిష్కారం చూపాలన్నారు.ఫిర్యాదులోని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పరిష్కరించిన సమస్యల వివరాలను వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా పోలీసులు ప్రజలకు న్యాయం అందించడంలో పూర్తి శ్రద్ధతో పని చేస్తున్నారని, బాధితులు ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.



